లోపం, బలహీనత, వ్యసనం: వీటికి ఉన్న తేడాలు, ప్రభావం

లోపం, బలహీనత, వ్యసనం: వీటికి ఉన్న తేడాలు, ప్రభావం

లోపం, బలహీనత, వ్యసనం: ఈ మూడు పదాల్ని ఒకే భావాన్ని (negativity) తెలియజేసేందుకు మనం తరుచుగా వాడుతుంటాం. కానీ ఈ పదాలకి గల తేడాలు, వీటి తీవ్రత మరియు ప్రభావం గురించి తెలుసుకుందాం.

(1) లోపం:

లోపం అంటే ఏంటి?

ఒక వ్యక్తికి గాని లేదా వస్తువుకి గాని ఉండాల్సిన లక్షణాలు సాధారణ స్థితిలో లేకుండా తక్కువ స్థితిలో ఉంటే దాన్ని లోపం అంటారు. ఈ లోపాలు ఎక్కువగా శరీరానికి, ఆరోగ్యానికి సంబంధించినవిగా ఉంటాయి. లోపం అనేది మనిషి విషయంలో పుట్టుకతోనే కాకుండా మధ్యలో కూడా వస్తుంది. కంటికి, కాళ్లకు, చేతులకు సంబంధించిన అవిటితనంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల్ని లోపాలుగా అభివర్ణిస్తారు.

ఇంగ్లీష్ లో లోపాన్ని డెఫిషియన్సీ (deficiency) అని అంటారు. వస్తువు విషయంలో డిఫెక్ట్ (defect) అని, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ (manufacturing defect) అని అంటారు.

మనిషిపైన, సమాజంలో లోపం యొక్క ప్రభావం ఎంత ఉంటుంది?

ఈ మూడింటిలో లోపాల్ని తేలిక గానే తీసుకోవచ్చు. ఎవరికైతే లోపం ఉంటుందో, ఆ లోపం యొక్క ప్రభావం కేవలం ఆ మనిషి, అతని కుటుంబం పైన మాత్రమే ఉంటుంది. దీని వల్ల ఆ వ్యక్తి కొన్ని సమయాల్లో ఇతరులపై ఆధార పడవలసి వస్తుంది. ఒక వ్యక్తికి ఉన్న లోపం వల్ల సమాజానికి ఏమంత నష్టమూ ఉండదు.

(2) బలహీనత:

బలహీనత అంటే ఏంటి?

ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. మనిషి యొక్క ఎమోషన్స్ ని, ఇన్నర్ ఫీలింగ్స్ ని తెలియజేసే క్రమంలో అతిగా స్పందించి తెలియజేసే భావ ప్రకటనను బలహీనత అంటారు. ఈ బలహీనతల్ని ఎక్కువగా ఇతరులపై ప్రేమ, ఆప్యాయత, ద్వేషం, కోపం, అసహ్యం వంటి రూపాల్లో ప్రదర్శిస్తారు. వీటిలో కొన్ని బలహీనతలు మంచివే అయినా, కొన్ని మాత్రం చెడు పరిణామాలకు దారితీస్తాయి.

బలహీనతల్ని ఇంగ్లీష్ లో వీక్నెస్ (weakness) అంటారు.

మనిషిపైన, సమాజంలో బలహీనతల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది?

ఈ బలహీనతలు ప్రతి మనిషిలోనూ మోస్తరుగా ఉంటాయని డాక్టర్లు కూడా తేల్చేశారు. బలహీనతలు కేవలం ఒక మనిషి పైనే కాకుండా ఇతరుల పైనా ప్రభావం చూపుతుంది. తీవ్రతను బట్టి వీటి ప్రభావం ఏకంగా కుటుంబాలపైన, ప్రాంతాలపైన, వర్గాలపైన, కులాలపైన, మతాలపైన, దేశాలపైన ప్రభావం చూపుతుంది.
సోషల్ మీడియాని వేదికగా చేసుకొని చాలా మంది తమ అక్కసును, ద్వేషాన్ని వెల్లగక్కే క్రమంలో తమకు తెలియకుండానే ఈ బలహీనతల తీవ్రతను పెంచుకుంటూ పోతున్నారని డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు.
ప్రస్తుత సమాజంలో వ్యసనాల కంటే ద్వేషం, కోపం, అక్కసు వంటి బలహీనతలే ఎక్కువ కీడు చేస్తున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు.

(3) వ్యసనం:

వ్యసనం అంటే ఏమిటి?

తాము చేస్తున్న పని తప్పని తెలిసినా, పదే పదే చేస్తూ ఉంటే దానిని వ్యసనం అంటారు. మన పూర్వికులు సప్త వ్యసనాలు గురించి, వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ఎప్పుడో తెలియజేశారు. కానీ ప్రస్తుత సమాజంలో ఈ వ్యసనాలల్లో ధూమపానం, మత్తు పదార్ధాలు, సెక్స్ వీడియోలను చూడటం వంటి కొత్త వ్యసనాలు వచ్చి చేరాయి.

వ్యసనాన్ని ఇంగ్లీష్ లో అడిక్షన్ (addiction) అంటారు.

Addiction meaning in Telugu, వ్యసనం అంటే ఏమిటి
Addiction meaning in Telugu (వ్యసనం అంటే ఏమిటి?)

మనిషిపైన, సమాజంలో వ్యసనం యొక్క ప్రభావం ఎంత ఉంటుంది?

ఈ వ్యసనాల యొక్క ప్రభావం ముఖ్యంగా వ్యసనపరుడు మరియు అతని కుటుంబంపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. ఈ వ్యసనాల వల్ల వ్యసనపరుడు ఆరోగ్యపరంగా తప్పుకుండా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అలాగే ఈ వ్యసనాల వల్ల వ్యసనపరుడు మరియు అతని కుటుంబం ఎంతో కొంత ఆర్థిక నష్టం, మానసిక ఆందోళనలు భరించవలసి వస్తుంది.

కొత్త వ్యసనాలకు బానిసలవుతున్న పిల్లలు, టీనేజర్లు, పెద్దవాళ్ళు

  • ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో సప్త వ్యసనాలల్లో కొన్ని వ్యసనాలను అక్కడక్కడా “సోషల్ స్టేటస్“, “లీవ్ లైఫ్ కింగ్ సైజ్“, “కో-లీవ్” వంటి పేర్ల రూపంలో కొనసాగిస్తున్నారు.
  • మగవారితో పాటు ఆడవారు కూడా అన్ని వ్యసనాలను అలవాటు చేసుకుంటున్నారు.
  • టీనేజర్లు ఎక్కువగా కొన్ని సోషల్ మీడియా సైట్లకి, ఇతర నెట్ వర్కింగ్ ఆప్స్ కి బానిసలు అవుతున్నారు. ప్రపంచంలో సెల్ఫీలు తీసుకుంటూ మరణించే వారి సంఖ్యలో దాదాపు 40% మంది భారతీయులే ఉండడం శోచనీయం.
  • పిల్లలు మొబైల్ గేమ్స్ ఆడటం అనేది వ్యసనంగా మార్చుకుంటున్నారు. బ్లూ వేల్, పబ్ జి గేమ్స్ ప్రభావం ఏ స్థాయిలో ఉండిందో చూసాము.
  • వయస్సు పైబడిన ఆడవాళ్ళు టీవీ చూడటాన్ని వ్యసనంగా మార్చుకుంటున్నారు. రోజుకు రెండు గంటలకు పైగా టీవీ చూడటం అనేది పెద్ద వ్యసనమే అని మానసిక నిపుణులు తేల్చేశారు. మన తెలుగు వాళ్ళు అయితే స్టార్ మా ఛానెల్ ను ఏకంగా జీఈసి (జనరల్ ఎంటర్టైన్మెంట్ కేటగిరి) కేటగిరిలో నెంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టారు అంటే టీవీని ఏ రేంజ్ లో చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
  • సిటీల్లో, పెద్ద పట్టణాల్లో వ్యసనాలకు లోనవుతున్న వారి సంఖ్య చాలా త్వరగా పెరుగుతోంది.
  • సమయాభావం వల్ల ఉద్యోగస్తులు ఈ కొత్త వ్యసనాలకు చాలా దూరంగానే ఉంటున్నారు.

వ్యసనాలను, బలహీనతలను ఆదిలోనే తుంచేయాలి. లేదంటే వీటి ప్రభావం, జరిగే నష్టాలు అధికంగానే ఉంటాయి. మెడిటేషన్ ద్వారా ఆలోచనల్ని, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది. వ్యసనాల నుంచి మరియు బలహీనతల నుంచి దూరంగా జరగాలంటే డాక్టర్లను కాని, ఆధ్యాత్మిక గురువులని కాని సంప్రదించండి.