Interesting Telugu Stories 1: Mehren Karimi Nasseri Story In Telugu

Interesting Telugu Stories 1: Mehren Karimi Nasseri Story In Telugu
మెహ్రన్ కరీమీ నస్సేరి (నస్సరి) గురించి చాలా మంది భారతీయులకు అంతగా తెలియదు. మెహ్రన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇతను పద్దెనిమిది సంవత్సరాల పాటు బయటకు రాకుండా, ఫ్రాన్స్ దేశంలోని పారిస్ విమానాశ్రయంలో నివసించాడు. కాదు కాదు, నివసించ వలసి వచ్చింది. విమానాశ్రయం బయట అడుగు పెట్టేందుకు వీలు లేదు. కొన్ని దేశాలు చిన్న చిన్న రూల్స్ ను కూడా కఠినంగా పాటించడంతో నస్సేరి దాదాపు రెండు దశాబ్దాలపాటు విమానాశ్రయం లో నివసించే వలసి వచ్చింది. “ది టెర్మినల్ మ్యాన్” గా ప్రసిద్ధి చెందిన మెహ్రన్ నస్సేరి స్టోరీని పూర్తిగా Interesting Telugu Stories లో చదవండి.

మెహ్రన్ నస్సేరి ఇరాన్ దేశం లో 1946 లో జన్మించిన ఆంగ్లో పెర్షియన్. అతడి తండ్రి ఇరాన్ దేశానికి చెందిన ఒక డాక్టర్. అతని తల్లి స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక నర్సు. నస్సేరి కి రెండు దేశాల్లోనూ బంధువర్గం బాగానే ఉంది. విప్లవ భావాలు ఎక్కువగా ఉండడంతో మెహ్రన్ నస్సేరి తరుచుగా ఇరాన్ ప్రభుత్వం పైన, బాద్షా పైన నిరసన కార్యక్రమాలు చేపట్టే వాడు. ఈ నిరసనల కారణంగా ఇరాన్ ప్రభుత్వం అతన్ని 1977 వ సంవత్సరంలో తమ దేశం నుంచి బహిష్కరించింది. దీంతో మెహ్రన్ నస్సేరి తనకు యూరోప్ లో ఏదైనా రెఫ్యూజి (శరణార్థుల) క్యాంపులో నివాసం కల్పించాలని యునైటెడ్ నేషన్స్ ని అభ్యర్తించాడు. యునైటెడ్ నేషన్స్ అతనికి రెఫ్యూజి స్టేటస్ జారి చేస్తూ, అతన్ని బెల్జియం లోని రెఫ్యూజి క్యాంపులో నివసించేందుకు అనుమతిని ఇచ్చింది. ఆ క్యాంపులోనే నస్సేరి తన జీవితాన్ని గడపసాగాడు. స్కాట్లాండ్, ఇంగ్లాండ్ లోని తన తల్లి తరుపు బంధువులు అతన్ని ఇంగ్లాండ్ కు వచ్చేయాలని సూచించారు. వారి సూచన మేరకు 1986 లో నస్సేరి ఇంగ్లాండ్ కి వెళ్లి అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు.
బెల్జియం నుంచి ఇంగ్లాండ్ కు వెళ్ళాలంటే మొదట ఫ్రాన్స్ ని చేరుకొని, అక్కడి నుండి ఇంగ్లాండ్ కు వెళ్ళాలి. 1988 లో నస్సేరి ఫ్రాన్స్ కు రైలు, రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాడు. ఈ మార్గంలో తన రెఫ్యూజి డాక్యుమెంట్స్ ఉన్న సూట్ కేసు ను అతను జారవిడుచుకున్నాడు. ఆ సూట్కేస్ దొంగిలించ బడిందని అతను తన ఆత్మ కథలో పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ ఎంబసీకి అతను ఎలాంటి ధృవీకరణ పత్రాలు సమర్పించలేక పోవడంతో, అతనిని వారు ఫ్రాన్స్ ఎయిర్ పోర్ట్ కు తిరిగి పంపించారు. పత్రాలు లేని కారణంగా అతన్ని ఫ్రాన్స్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే విమానాశ్రయం లో ఉంటే అరెస్టు చేసేందుకు ఏ నియమాలు అడ్డురాని కారణంగా అతన్ని విడుదల చేశారు. కానీ ఎయిర్ పోర్ట్ నుండి బయటికి వస్తే అరెస్టు చేసేందుకు తమకు అధికారాలు ఉన్నాయని చెప్పారు. త్వరగా పత్రాలు తెప్పించుకొని ఫ్రాన్స్ వదిలి వెళ్ళి పొమ్మని సలహా ఇచ్చారు.

అయితే నస్సేరికి అసలు సమస్య ఇక్కడే మొదలైంది. రెఫ్యూజి డాక్యుమెంట్స్ కోసం ఫ్రాన్స్ విమానాశ్రయం నుంచే అప్లయ్ చేసుకున్నాడు నస్సేరి. అయితే బెల్జియం దేశం డాక్యుమెంట్స్ ఇచ్చేందుకు నిరాకరించింది. అతను బెల్జియం దేశానికి వచ్చి ఆ పత్రాలను తీసుకోవాలని చెప్పింది. రెఫ్యూజి డాక్యుమెంట్స్ తీసుకోవాలంటే సదరు వ్యక్తి తప్పనిసరిగా బెల్జియం దేశానికి వచ్చి తీసుకోవాలనే నియమం ఉందని నస్సేరికి తెలిపింది. ఒకసారి జారీ చేసిన పత్రాలు పోగొట్టుకున్నాడు కాబట్టి బెల్జియం దేశంలోని పోలీసు స్టేషన్ లో కూడా అతను కంప్లైంట్ ఇవ్వాలని చెప్పారు. ఆ కంప్లైంట్ ఆధారంగా ఫ్రాన్స్ లోని పోలీసులతో సంప్రదించిన తర్వాతే అతనికి కొత్త పత్రాలు ఇవ్వాలా లేదా అని నిర్ణయానికి వస్తామని చెప్పారు. ప్రస్తుతం ఏ దేశానికి సంబంధించిన సిటిజెన్షిప్ లేక పోవడంతో అతను యూరోప్ లో తిరగలేడు. అటు బెల్జియం దేశానికి వెళ్లలేక, యూకేలో అడుగు పెట్టేందుకు వీలు లేక చార్లెస్ డి గల్లె ఎయిర్ పోర్ట్ లోనే ఉండి పొయ్యాడు నస్సేరి.నస్సేరి తన 18 ఏళ్ల బసను పారిస్ లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయంలో ప్రారంభించారు. నస్సేరి రోజు వార్తా పత్రికలు, మ్యాగజైన్స్, పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. రోజు డైరిలో తన దినచిర్య గురించి వ్రాసుకొనేవాడు. ఎయిర్ పోర్ట్ లో పని చేసేందుకు అతనికి పర్మిషన్ లేదు. దీంతో అక్కడి షాప్ ఓనర్లు అతనిపై దయతో వ్యవహరించేవారు. అతనికి భోజనం, పుస్తకాలను మరియు ఇతర నిత్యావసర వస్తువులను సమకూర్చేవారు. నస్సేరి కథ క్రమంగా ఇతర దేశాలకు ప్రాకింది. అతనికి వివిధ దేశాల నుండి డబ్బులు పంపించడం మొదలు పెట్టారు. నస్సేరి కథ క్రిస్టియన్ బూర్గెట్ అనే పేరుగల ఒక ఫ్రెంచి మానవ హక్కుల న్యాయవాది చెవిన పడింది. నస్సేరికి సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాడు. అతడి తరపున బలంగా వాదనలు వినిపించాడు.

ఎట్టకేలకు బెల్జియం పది సంవత్సరాల తరువాత అతనికి కొత్త రెఫ్యూజి పత్రాలను జారీ చేసింది. అయితే నస్సేరి ఆ పత్రాలను అసత్యమని తిరస్కరించాడు. వారు ఇచ్చిన పత్రాల్లో నస్సేరి ఒక జలాంతర్గామిలో స్వీడన్ నుండి ఇరాన్ కు ప్రయాణించాడని తెలిపారు. ఇది పూర్తిగా అవాస్తవం అని అతడు ఈ పత్రాలను తిరస్కరించాడు. మెహ్రాన్ నస్సేరి 2006 వరకు విమానాశ్రయంలోనే ఉన్నాడు. 2006 లో అతను తెలియని అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. అతన్ని 2007లో ఆసుపత్రి నుంచి విడుదల చేశారు. ఫ్రెంచ్ ప్రభుత్వం నస్సేరికి ఫ్రాన్స్ లో నివాసం ఉండేందుకు అనుమతి జారీ చేసింది. తరువాత అతను పారిస్ శివారుల్లో ఒక ఇంట్లో నివసిస్తున్నాడు.స్పీల్ బర్గ్ నస్సేరి కథను ఆధారంగా చేసుకుని 2004 లో “ది టెర్మినల్” అనే చిత్రాన్ని నిర్మించాడు. నస్సేరి జీవిత కథను చిత్రంగా మలిచేందుకు స్పీల్ బర్గ్ అప్పట్లోనే 2.50 మిలియన్ డాలర్లను నస్సేరి కి ముట్టచెప్పి రైట్స్ తీసుకున్నాడని అమెరికన్ పత్రికలు ప్రచురించాయి. సినిమా థియేటర్లలో “ది టెర్మినల్” చిత్రాన్ని వీక్షించాలన్న నస్సేరి కోరిక నెరవేరలేదు. ఎందుకంటే అప్పటికీ అతను విమానాశ్రయం లోనే గడుపుతూ ఉన్నాడు.