You are currently viewing అంతర్జాతీయ మహిళా దినోత్సవం – International Women’s Day In Telugu – 2021

అంతర్జాతీయ మహిళా దినోత్సవం – International Women’s Day In Telugu – 2021

ప్రతి సంవత్సరం మార్చి నెల 8వ తేదీన మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇంగ్లీష్ లో International Women’s Day అని, IWD అని అంటారు. ఈ కార్యక్రమం యొక్క చరిత్ర, ఉద్దేశం మొదలగు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ దేశాల్లోని మహిళలందరూ ఒకే రోజున ఈ కార్యక్రమాన్ని జరుపుకొనేందుకు గల కారణాలు తెలుసుకుందాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? – International Women’s Day Goals

ప్రపంచంలో మహిళలు సామాజిక పరంగాను, ఆర్థిక పరంగాను, రాజకీయ పరంగాను మరియు సాంస్కృతిక పరంగాను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలపై దృష్టి సారించి మహిళలు పురోగతి సాధించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే లింగ వివక్షకు తావు లేకుండా చేసి అన్ని రంగాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క మరొక ముఖ్య ఉద్దేశం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం – International Women’s Day

అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క చరిత్ర – International Women’s Day History

న్యూయార్క్ సిటీలో 1909 ఫిబ్రవరి 28 వ తేదీన థెరిస్సా మాల్కియల్ అధ్యక్షతన అమెరికన్ ప్రజలు మహిళా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఇది గమనించిన జర్మన్ డెలిగేట్స్ క్లారా జెట్కిన్, కేట్ డంకర్, పౌలా థీడ్ 1910 వ సంవత్సరంలో జరిగిన సోషియలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో మహిళా దినోత్సవం యొక్క ఆవశ్యకతను ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకోవాలనే ఆలోచనను ఈ సభలో వీరు ప్రస్తావించారు. 17 దేశాలకు చెందిన 100 మంది సభ్యులు వీళ్ల ఆలోచనను స్వాగతించారు. ఆలస్యం చేయకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి వెనువెంటనే ఆమోదించుకున్నారు.

ఈ తీర్మానం ఫలితంగానే 1911 మార్చి 19న మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. వివిధ దేశాల్లో ఒకేసారి నిర్వహించిన ఈ కార్యక్రమంలో పది లక్షలకు పైగా మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఐరోపా ఖండం లోని జర్మనీ, ఆస్ట్రియా, హంగేరి, డెన్మార్క్, స్విట్జర్లాండ్ మొదలగు దేశాల్లో మహిళలు తమ డిమాండ్లతో కూడిన బ్యానర్లు పట్టుకొని పెరేడ్లు నిర్వహించారు.
అప్పట్లో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. ప్రభుత్వ ఆఫీసుల్లో మహిళలకు ఉద్యోగం ఇచ్చేవారు కాదు. ప్రైవేట్ ఆఫీసుల్లో అక్కడక్కడ వీరికి ఉద్యోగాలు దొరికేవి. దొరికిన ఉద్యోగాల్లో కూడా వీరిపై పని ఒత్తిడి తీవ్రంగా ఉండేది. 19వ దశకం ప్రారంభం నుంచి ఐరోపా దేశాల్లోనూ మరియు ఇతర ఖండాల్లోనూ యుద్ధాలు విపరీతంగా జరిగేవి. చాలా దేశాల్లో గాయపడిన జవాన్లకు సేవలను అందించేందుకు గాను మహిళలను వినియోగించుకునేవారు. నిత్యం యుద్ధాలవల్ల ఈ మహిళలకు విశ్రాంతి అనేది ఉండేది కాదు. మరోవైపు కొన్నిచోట్ల స్త్రీలను కేవలం గృహాలకే పరిమితం చేసే వారు.

ఈ పరిస్థితుల నుండి బయటపడేందుకు మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వీరు వినిపించిన ముఖ్య డిమాండ్లు ఇవి:

  • మహిళలకు ఓటు హక్కు కల్పించడం.
  • ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో మహిళలకు ఉద్యోగాలు కల్పించడం.
  • యుద్ధంలో మహిళా సేవకురాల్లకు పని ఒత్తిడి తగ్గించడం.
  • నిత్యం ఇంటి పనుల్లో ఉండే స్త్రీలకు కూడా కాస్త విశ్రాంతి, స్వేచ్ఛను కల్పించడం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2021 శుభాకాంక్షలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2021 శుభాకాంక్షలు

మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణాలు – Reasons Behind Celebrating International Women’s Day On March 8

అప్పట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ప్రత్యేక తేదీ అంటూ ఏమీ ఉండేది కాదు. దీన్ని ఎక్కువగా ఆదివారం నాడు జరుపుకునేవారు. అమెరికన్లు ఫిబ్రవరి నెలలో చివరి ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని జరుపుకునేవారు.

ఐరోపాలో 1914వ సంవత్సరంలో మార్చి 8న ఆదివారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. జర్మనీలో మహిళలకు ఓటు హక్కు కల్పించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీని ఫలితంగా 1918 వ సంవత్సరంలో జర్మన్ మహిళలకు ఓటు హక్కు లభించింది.
అలాగే అదే రోజు అనగా 1914 మార్చి 8న లండన్ లో బోవ్ (Bow) ప్రాంతం నుంచి ట్రఫాల్గర్ స్క్వేర్ (Trafalgar Square) వరకు మహిళలు ర్యాలీ నిర్వహించతలపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉపన్యసించాల్సిన సామాజిక నాయకురాలు సిల్వియా ప్యాన్కుర్స్ట్ ను మార్గమధ్యంలో అరెస్టు చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో మార్చి 8న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి సంబంధించిన వార్తలు, విషయాలు ప్రపంచమంతా పాకాయి.
రష్యాలో మార్చి 8, 1917 జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏకంగా రష్యన్ రెవల్యూషన్ కి దారి తీసింది. దీని ఫలితంగా రష్యన్ జార్ (రాజు) నికోలస్-II పదవి కోల్పోయాడు.

యునైటెడ్ నేషన్స్ మొట్టమొదటిసారి 1975వ సంవత్సరంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపుకొంది. 1977వ సంవత్సరంలో మార్చి 8 వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తిస్తూ యునైటెడ్ నేషన్స్ సభ్యదేశాల ఆమొదం పొందింది. అప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు, సంస్థలు ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.

Leave a Reply