ఆయిల్ రిఫైనరీ కంపెనీల ఎగుమతుల పై కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ విధించడం తో స్టాక్ మార్కెట్లోని అన్ని ఆయిల్ రిఫైనరీ సంస్థల షేర్లు కుప్పకూలాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), ఓఎన్జీసీ (ONGC), ఎమ్ఆర్పీఎల్ (MRPL) మొదలగు ఆయిల్ రిఫైనరీ షేర్లు భారీగా పతనమయ్యాయి.
ఆయిల్ రిఫైనరీ సంస్థ | నష్టం (రూపాయలు) | నష్టం (శాతం) |
---|---|---|
రిలయన్స్ ఇండస్ట్రీస్ Reliance Industries | ₹ -189.65 | -7.31% |
ఓఎన్జీసీ (ONGC) | ₹ -20.15 | -13.30% |
ఎమ్ఆర్పీయల్ (MRPL) | ₹ -9.05 | -9.99% |
ఆయిల్ ఇండియా (Oil India) | ₹ -37.30 | -14.83% |
నిఫ్టీ | -28.20 | -0.18% |
భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF – Air Traffic Fuel) ఎగుమతుల పై ట్యాక్స్ ను లీటర్ రూపేణా విధించారు.
పెట్రోల్ | ₹ 6.00 |
విమాన ఇంధనం | ₹ 6.00 |
డీజిల్ | ₹ 13.00 |
ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకానొక దశలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 120 డాలర్లను కూడా దాటేసింది. దీన్ని అదునుగా తీసుకున్న భారత దేశంలోని ఆయిల్ రిఫైనరీ సంస్థలు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం ప్రారంభించాయి.
అంతర్జాతీయ మార్కెట్లో పెట్రో ఉత్పత్తుల రేట్లు భారీగా పెరిగాయి. కానీ దేశీయ మార్కెట్లో రేట్లు అందుకు అనుగుణంగా పెరగలేదు. అందుకే ఆయిల్ రిఫైనరీ సంస్థలు వాటి ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడం తగ్గించేసి, ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించి అధిక లాభాలను (windfall gains) గడించాయి.
స్టాక్ మార్కెట్ వర్గాల్లో ఈ విండ్ ఫాల్ గెయిన్స్ (windfall gains) పై ప్రభుత్వం తప్పనిసరిగా టాక్స్ విధిస్తుంది అన్న ప్రచారం కొద్ది నెలలు క్రిందట మొదలైంది. ప్రభుత్వ వర్గాలను సంప్రదించిన ప్రతీ సారి, తాము ఈ విషయం పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్తూ వచ్చింది. ఈ ప్రచారానికి, సందేహానికి ఇవాల్టితో తెరవేస్తూ ప్రభుత్వం ఆయిల్ రిఫైనరీ సంస్థల విండ్ ఫాల్ గేయిన్స్ పై టాక్స్ విధించింది.
ఈ ట్యాక్స్ మార్కెట్లు ఊహించిన దాని కన్నా చాలా అధికంగా ఉండడంతో ఆయిల్ రిఫైనరీ సంస్థల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.